దసరాకు 25 లక్షల మంది.. భక్తుల సేవకే పెద్దపీట
ఈ నెల 14న దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి.. 15న సరస్ మేళా ప్రారంభం… 30 వేల మందికి మూడు హోల్డింగ్ ప్రాంతాలు.. 500 సీసీ కెమెరాలతో నిఘా… దర్శనం నుంచి తిరుగు ప్రయాణం వరకు సమన్వయంతో సేవలు: మంత్రి ఆనం…

విజయవాడ, అక్టోబర్ 6: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రులు సత్యకుమార్, అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఉన్నతాధికారులతో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని మంత్రి ఆనం తెలిపారు. దేశ ప్రథమ పౌరురాలు దసరా వేడుకలకు రావడం రాష్ట్రానికి, విజయవాడకు గర్వకారణమన్నారు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ప్రముఖుల పర్యటనల సమయంలోనూ సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు ప్రాంతాల్లో 30 వేల మందికి వసతి రోజుకు సగటున 2.5 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మూడు హోల్డింగ్ ప్రాంతాల్లో సుమారు 30 వేల మంది వేచి ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అక్కడ ప్రసాదం, ఆహార పొట్లాలు, సాంబారు అన్నం, పెరుగన్నం, బిస్కెట్లు, మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అవసరానికి అనుగుణంగా అదనపు సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్యూలైన్లలో నిరీక్షణ సమయాన్ని తగ్గించేలా రద్దీని నిరంతరం పర్యవేక్షించాలని, వైద్య సిబ్బంది, అంబులెన్సులు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత భవానీల కోసం మరో మూడు, నాలుగు రోజులపాటు ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తామన్నారు. 500 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అందరికీ సక్రమంగా అమ్మవారి దర్శనం కల్పించేలా భద్రతా చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ఏడాది 500 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కొండపై అనధికార వాహనాలను పూర్తిగా నియంత్రిస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు దర్శనంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాలు, సరస్ మేళా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రద్దీకి అనుగుణంగా వాహనాల మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. సాంకేతికతతో రద్దీ నియంత్రణ భక్తుల భద్రత, రద్దీ నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు తెలిపారు. హోల్డింగ్ ప్రాంతాలు, క్యూలైన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిర్వహణకు ‘అస్త్రం’ యాప్‌ను వినియోగించనున్నట్లు చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూనే విధుల్లో ఉండే సిబ్బంది సంక్షేమంపైనా శ్రద్ధ తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రత్యేక అధికారుల ద్వారా సిబ్బందికి భోజనం, మందులు, ఇతర అవసరాలు సమకూరుస్తున్నామన్నారు. ఏర్పాట్లలో సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. ఘాట్ రోడ్డు పనులు పూర్తయ్యాయని, ప్రోటోకాల్ దర్శనాలకు రెండు సమయ విభాగాలతో ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. దసరాతోపాటు విజయవాడ ఉత్సవం, సరస్ మేళా జరుగుతున్న నేపథ్యంలో పోలీసు, దేవాదాయ, రెవెన్యూ, నగరపాలక సంస్థ, వైద్యారోగ్య, రవాణా తదితర శాఖలు నిరంతర సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం సూచించారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.

