సైబర్ ‘వల’ విస్తరిస్తోంది.. చిక్కింది తక్కువే!
ఎన్టీఆర్ జిల్లాలో పెరిగిన సైబర్ మోసాల ఫిర్యాదులు... 2025 జనవరి–జూలైలో 2,362 కేసులు.. 2026లో 2,539కు పెరుగుదల... మోసపోతే ఆలస్యం వద్దు.. వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచన...

విజయవాడ క్రైమ్ ఆగస్టు 20 (ఆంధ్రప్రభ): ఎన్టీఆర్ జిల్లాలో సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతున్నాయి. NCRP డేటా ప్రకారం 2025 జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 2,362 సైబర్ మోసాల ఫిర్యాదులు నమోదుకాగా, 2026లో ఇదే కాలంలో వాటి సంఖ్య 2,539కు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 177 ఫిర్యాదులు అధికంగా నమోదయ్యాయి.
2025 జనవరి–జూలై మధ్య నమోదైన సైబర్ మోసాల్లో బాధితులు రూ.27.13 కోట్ల మేర నష్టపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026లో ఇదే కాలంలో బాధితులు కోల్పోయిన మొత్తం రూ.23.14 కోట్లుగా నమోదైంది. ఫిర్యాదుల సంఖ్య పెరిగినప్పటికీ, బాధితులు కోల్పోయిన మొత్తం గత ఏడాదితో పోలిస్తే రూ.3.99 కోట్లు తగ్గడం గమనార్హం.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అపరిచితుల నుంచి వచ్చే లింకులు, పెట్టుబడి ఆఫర్లు, ఆన్లైన్ టాస్క్‌లు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సకాలంలో సమాచారం అందించడం ద్వారా మోసపూరితంగా బదిలీ అయిన నగదును సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
‘గోల్డెన్ అవర్’లో స్పందించడం సైబర్ మోసాల్లో అత్యంత కీలకమని, డబ్బు పోయిన తర్వాత నిరాశ చెందకుండా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. సైబర్ నేరాలపై అవగాహనతో పాటు అనుమానాస్పద లావాదేవీల విషయంలో అప్రమత్తతే ప్రధాన రక్షణ అని స్పష్టం చేస్తున్నారు.

