పేదల వైద్యానికి రూ.2 కోట్ల భరోసా
పదకొండో డివిజన్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ అర్హులందరూ దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలి కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలి: ఎమ్మెల్యే గద్దె


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 23 : పేదల సంక్షేమంతోపాటు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు. పదకొండో డివిజన్ రైతుబజార్ రోడ్డులోని రవీంద్ర ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2 కోట్ల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముమ్మనేని ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పరిమితంగా ఉన్నప్పటికీ అత్యవసర వైద్యం చేయించుకున్న పేదలకు ఖర్చులో అధిక భాగాన్ని ప్రభుత్వం అందిస్తోందని

చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి సహాయ నిధిని సమర్థంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంపై అవగాహన పెంచుకొని అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అండగా నిలుస్తున్నారని అన్నారు. వైద్య సహాయం కోరిన వారికి ప్రభుత్వ నిధులతోపాటు అవసరమైన సందర్భాల్లో సొంత నిధులతోనూ సహకరిస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాదెండ్ల రాజేష్, దేవినేని అపర్ణ, పేరేపి ఈశ్వర్, భాగం సాయిప్రసాద్, సుగసాని రత్నశ్రీ, దయాల శిరీషాగాంధీ, జాస్తి సురేష్, చలసాని రమణ, దేవరపల్లి ఆంజనేయులు, గద్దె రమేష్, పడాల గంగాధర్, హరిప్రసాద్, బంగారు మురళీ, అబ్దుల్ కరీమ్, సింగంశెట్టి రమేష్, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు.

