బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ విధానం
జయహో బీసీ అనేది ఎన్నికల నినాదం కాదు.. ప్రభుత్వ విధానం... స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యం... బీసీలకు గత వైసీపీ పాలనలో అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శ...

విజయవాడ, అక్టోబర్ 11: బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 'జయహో బీసీ' కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. జయహో బీసీ అనేది కేవలం ఎన్నికల నినాదం కాదని, కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి అండగా నిలిచారని, వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 1987లో ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అనంతరం చంద్రబాబు నాయుడు వాటిని 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు. గత వైసీపీ పాలనలో బీసీల రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు అందించే మొత్తాన్ని రూ.25 వేలకు పెంచినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి, బీసీలకు మధ్య ఉన్నది కేవలం రాజకీయ బంధం కాదని, అన్నదమ్ముల అనుబంధమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని, సుప్రీంకోర్టు తీర్పు, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. స్థానిక సంస్థల్లో వివిధ పదవులకు బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, సర్పంచులకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలకు 24.60 శాతం, జెడ్పీటీసీలకు 24.60 శాతం, జెడ్పీ చైర్‌పర్సన్లకు 23.08 శాతం, పట్టణ స్థానిక సంస్థల వార్డు సభ్యులకు 32.78 శాతం, మున్సిపల్ చైర్‌పర్సన్లకు 33.02 శాతం, మేయర్లకు 35.29 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు. బీసీల సంక్షేమంలో భాగంగా సూక్ష్మ రుణాలు, గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాల కేటాయింపు, నేతన్న నేస్తం, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

