పేదల చేతికి పట్టాలు.. సొంతింటిపై శాశ్వత హక్కులు
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... పేదల సొంతింటి కలను సాకారం చేసిన కూటమి ప్రభుత్వం... ఆస్తిపై శాశ్వత హక్కుతో కుటుంబాల భవిష్యత్తుకు భరోసా...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 30: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం బుధవారం విజయవాడలో ఘనంగా జరిగింది. సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదికపై పలువురు మహిళా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలకు సొంతింటిపై సంపూర్ణ హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న కుటుంబాలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించి వారి జీవితాల్లో భద్రత నింపుతున్నామని తెలిపారు. ఇళ్ల పట్టాలతో పేద కుటుంబాలకు

శాశ్వత చిరునామాతోపాటు విలువైన ఆస్తి సమకూరుతుందని చెప్పారు. పేదల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

