దసరా భద్రతకు ఏఐ కవచం!
భక్తుల రద్దీ నియంత్రణకు కృత్రిమ మేధ వినియోగం… డ్రోన్లు, సీసీ కెమెరాలతో ఇంద్రకీలాద్రిపై నిరంతర నిఘా… ఆధునిక సాంకేతికతతో భక్తులకు భద్రత: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

విజయవాడ, అక్టోబర్ 14: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్తుల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. సంప్రదాయ పోలీసు బందోబస్తుతోపాటు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. దసరా ఉత్సవాల్లో భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసేందుకు ఏఐ ఆధారిత విశ్లేషణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నామని వివరించారు. రద్దీ పెరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కొండపై క్యూలైన్లు, ఘాట్రోడ్లు, పార్కింగ్ ప్రదేశాలతోపాటు భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ డ్రోన్లు, సీసీ కెమెరాల నుంచి అందుతున్న దృశ్యాలను కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. రద్దీ పెరిగిన వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం కొనసాగుతోందని వివరించారు. వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా దేవస్థానం పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలు, బూమ్ బ్యారియర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అనుమతి ఉన్న వాహనాల ప్రవేశాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. భక్తులు సహకరించాలి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, క్యూలైన్లలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని డీజీపీ కోరారు. చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే సమీపంలోని పోలీసు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన బందోబస్తు, అధికారుల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించడమే లక్ష్యమన్నారు. డీజీపీ వెంట విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఉన్నారు.

