భవానీపురంలో రూ.కోటితో భూసార పరీక్ష కేంద్రం
నూతన కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన... 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో నిర్మాణం... మట్టి పరీక్షలతో రైతులకు శాస్త్రీయ సూచనలు.. పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగే అవకాశం...

విజయవాడ: రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను మరింత చేరువ చేసే దిశగా భవానీపురంలో నూతన భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. బాలభాస్కర్‌నగర్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శనివారం శంకుస్థాపన చేశారు.
సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో భూసార పరీక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారు. రైతులు సాగు చేపట్టే ముందు తమ పొలాల్లోని మట్టిని పరీక్షించుకోవడంతో అందులో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
మట్టి స్వభావం, పంటకు అవసరమైన పోషకాలు, ఏయే ఎరువులను ఎంత మోతాదులో వినియోగించాలనే అంశాలపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించనున్నారు. అవసరానికి మించి ఎరువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రించడంతో పాటు భూసారాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
భూసార పరీక్షల ఆధారంగా పంటలను సాగు చేయడం వల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి, పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. నూతన కేంద్రం అందుబాటులోకి వస్తే విజయవాడ పరిసర ప్రాంత రైతులకు భూసార పరీక్ష సేవలు మరింత సులభంగా అందనున్నాయి.

