విద్యార్థుల ముసుగులో రౌడీయిజాన్ని సహించం
ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి... సీసీ ఫుటేజీ ఆధారంగా బాధ్యులను గుర్తించాలి.. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచాలి... విజయవాడ ప్రశాంతతను దెబ్బతీసే చర్యలకు తావివ్వొద్దు: ప్రభుత్వ విప్ బొండా ఉమా...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ , సెప్టెంబర్ 22 : విద్యార్థుల ముసుగులో రౌడీయిజానికి పాల్పడితే సహించేది లేదని, శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు, సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై మంగళవారం మొగల్రాజపురంలోని తన నివాసం వద్ద ఆయన స్పందించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే చట్టపరమైన నిబంధనలకు లోబడి శాంతియుతంగా నిరసన చేపట్టాలని అన్నారు. ధర్నా చౌక్ అందుబాటులో ఉండగా అనుమతి లేకుండా బందరు రోడ్డుపై పెద్ద సంఖ్యలో గుమిగూడి ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే ప్రకటించినప్పటికీ అంతమంది అక్కడికి ఎలా చేరుకున్నారనే అంశంపైనా విచారణ జరపాలని కోరారు.
శాప్ కార్యాలయం వద్ద కర్రలు, రాళ్లు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లతో దాడి జరిగిందన్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని ఉమా అన్నారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీని పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రత్యక్షంగా దాడులకు పాల్పడిన వారిని గుర్తించాలని కోరారు. రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారి కదలికలు, గత నేరచరిత్రను పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

“విజయవాడలో రౌడీయిజానికి స్థానం లేదనే స్పష్టమైన సందేశాన్ని పోలీసులు ఇవ్వాలి. మేము చట్టాన్ని గౌరవిస్తూ సంయమనం పాటిస్తున్నాం. మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. పరిస్థితులు ఆ హద్దు దాటకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, మరోవైపు ఎంపికైన ఉపాధ్యాయులు తమ సర్టిఫికెట్లు, క్రీడా పతకాలు అసలైనవేనని చెబుతున్నారని పేర్కొన్నారు. అక్రమాలకు సంబంధించి ఎవరి వద్ద ఆధారాలు ఉన్నా సంబంధిత అధికారులకు లేదా న్యాయస్థానానికి సమర్పించి చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఆధారాల పేరుతో రోడ్లపై ఘర్షణలకు దిగడం, దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు.
విజయవాడలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను అడ్డుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై పార్టీలు, వ్యక్తులు అనే తేడా లేకుండా చర్యలు తీసుకోవాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

