పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ
అమరవీరుల కుటుంబాల సంక్షేమ ప్రయోజనాలపై ప్రత్యేక సమీక్ష... పెండింగ్ బకాయిలు, సదుపాయాలను త్వరితగతిన అందించేలా చర్యలు... విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమన్న సీపీ...

విజయవాడ, అక్టోబర్ 27 : విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు భరోసా ఇచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు–2026లో భాగంగా మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ నుంచి అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు, ఆర్థిక సహాయం, పెండింగ్ బకాయిలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా అందాల్సిన పరిహారం, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందాయా లేదా అని ఆరా తీశారు. ఇంకా ఏవైనా బకాయిలు పెండింగ్‌లో ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశం అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు సంస్మరణ వారోత్సవాలు–2026 జ్ఞాపికలను సీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, ఏఆర్ అదనపు డీసీపీ ఎన్.వి.రమణ, ఏఆర్ ఏసీపీ ప్రేమ్‌కుమార్, సీటీసీ ఏసీపీ ఉమామహేశ్వరరెడ్డి, ఏఏవో మహమ్మద్ ఇలియాస్ అహ్మద్, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, సీపీవో పరిపాలనా విభాగ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

