గ్యాస్ లీకై ఉపాధి బూడిద
భవానిపురం టీచర్స్ కాలనీలో బడ్డీ కొట్టు దగ్ధం త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన తిరుపతమ్మ బాధితురాలికి రూ.5 వేల తక్షణ సాయం అందించిన యేదుపాటి రామయ్య

విజయవాడ, సెప్టెంబర్ 26 : భవానిపురం టీచర్స్ కాలనీలో శనివారం ఉదయం గ్యాస్ లీకేజీ కారణంగా ఓ బడ్డీ కొట్టులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని వస్తువులన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్న తిరుపతమ్మ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అగ్నిప్రమాదంతో జీవనాధారమైన దుకాణాన్ని కోల్పోయిన తిరుపతమ్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన తక్షణ ఆర్థిక సాయంగా రూ.5 వేల నగదును అందజేశారు. ప్రభుత్వం కూడా స్పందించి బాధితురాలికి అవసరమైన సహాయం అందించాలని స్థానికులు కోరారు.

