నెల రోజుల్లో గన్నవరం సీహెచ్సీ రూపురేఖలు మారాలి
ఆసుపత్రి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి… క్యాజువాలిటీ భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి… రోగులకు మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు కల్పించాలి… అధికారులకు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశం…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం, అక్టోబరు 5: గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం రూపురేఖలు నెల రోజుల్లో మారేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించిన ఆయన, ప్రస్తుతం ఉన్న వసతులు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలతోపాటు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రాంగణంలోని రహదారుల అభివృద్ధి, పార్కింగ్ సదుపాయం, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, క్యాజువాలిటీ భవన నిర్మాణం తదితర అంశాలను ఒకే సమగ్ర ప్రణాళికలో పొందుపరచాలని అధికారులకు దిశానిర్దేశం

చేశారు. చేపట్టాల్సిన పనులకు ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించి, ఏ పనిని ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే వివరాలతో స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ముఖ్యంగా క్యాజువాలిటీ భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్ణయించిన పనుల్లో జాప్యానికి తావివ్వకుండా ముందుకు సాగాలని యార్లగడ్డ స్పష్టం చేశారు. నెల రోజుల్లో ఆసుపత్రిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, గన్నవరం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా సీహెచ్సీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.

