మాతాశిశు సంక్షేమానికి పెద్దపీట
పటమటలో 50 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం… అంగన్‌వాడీ కార్యకర్తలను సత్కరించిన గద్దె రామమోహన్, అనురాధ… ఆరోగ్యవంతమైన మానవ వనరుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 7: మాతాశిశు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. బుధవారం పటమటలోని నల్లూరి వారి కళ్యాణ మండపంలో స్త్రీ–శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భిణీల సామూహిక సీమంతం కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘సేవా సంకల్ప ఉత్సవ్’, జాతీయ పోషణ కార్యక్రమాల్లో భాగంగా 50 మంది గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో సేవలందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను సత్కరించారు. గర్భిణీలు, కార్యకర్తలకు చీరలు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడం, సురక్షిత ప్రసవానికి తోడ్పడటం వంటి సేవల్లో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. చిన్నారులను సొంత పిల్లల్లా ఆదరిస్తున్న

కార్యకర్తలను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యవంతమైన యువతను తీర్చిదిద్ది సమాజానికి మెరుగైన మానవ వనరులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గద్దె అనురాధ మాట్లాడుతూ గర్భధారణ దశ నుంచే తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు, చిన్నారుల విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ కేంద్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధితోనే సంపద సృష్టి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పి.భానుమతి, కళ్యాణ మండపం చైర్మన్ నల్లూరి రత్నశేఖర్, కర్ణ రమేష్, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, పేరేపి ఈశ్వర్, రత్నం రమేష్, సుగసాని రత్నశ్రీ, చిట్టా నిర్మల, యార్లగడ్డ సందీప్, వీరంకి డాంగే కుమారి, దయాల శిరీషా గాంధీ, ఫాతిమా, సింగంశెట్టి రమేష్, కోట శివలక్ష్మి, బి.గంగాధర్, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

