మెకానిక్ కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఒంగోలులో రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మెకానిక్ కుటుంబం నుంచే వచ్చా.. వారి కష్టాలు నాకు తెలుసన్న ఎమ్మెల్యే కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య కార్డు అవసరమని వెల్లడి


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఒంగోలు, ఆగస్టు 30: రాష్ట్రంలోని ద్విచక్ర వాహన మెకానిక్లు, కార్మికుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి చేరుకున్న ఎమ్మెల్యే రాముకు మెకానిక్లు, కార్మికులు టపాసులు పేల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం సంఘం ప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు. సంఘ అభివృద్ధితోపాటు మెకానిక్ సోదరుల సంక్షేమానికి పాటుపడతామని నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.

వారందరికీ ఎమ్మెల్యే రాము అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మెకానిక్లు ఒకే కుటుంబంలా ఈ కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు. “నాది కూడా మెకానిక్ కుటుంబమే. మెకానిక్లు పడే కష్టాలు నాకు తెలుసు. అందుకే మీలో ఒకడిగా మీతో కలిసిపోతున్నాను” అని పేర్కొన్నారు. వాహన శబ్దాన్ని బట్టే సమస్యను గుర్తించే మెకానిక్లు వైద్యులతో సమానమని కొనియాడారు. ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధిని ఎంచుకునే గొప్ప కుటుంబం మెకానిక్ కుటుంబమన్నారు. కులమతాలకు అతీతంగా మెకానిక్లంతా ఒకే కుటుంబంగా ముందుకు సాగుతున్నారని అభినందించారు.

