ఆపదలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండ
మధురానగర్‌లోని ఆరు కుటుంబాలకు రూ.4.87 లక్షల సాయం వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భరోసా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని బొండా ఉమా వెల్లడి



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ , సెప్టెంబర్ 22 (ఆంధ్రప్రభ): అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం 29వ డివిజన్ మధురానగర్‌కు చెందిన ఆరు కుటుంబాలకు రూ.4.87 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనుకోకుండా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పేద కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని


పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, సింగం వెంకన్న, డివిజన్ అధ్యక్షుడు పీవీఆర్, ప్రధాన కార్యదర్శి అంగిరేకుల రాంబాబు, కడప కోటేశ్వరరావు, బర్మా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

