నిరసన పేరుతో హింసకు తావివ్వొద్దు
ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం గురువులపై దాడులు అత్యంత హేయం వైసీపీ తీరు మార్చుకోకపోతే మనుగడ కష్టమే

విజయవాడ, సెప్టెంబర్ 23 (ఆంధ్రప్రభ): ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే అవకాశాన్ని ప్రతిపక్ష వైసీపీ దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు. నిరసన పేరుతో గురువులను దుర్భాషలాడుతూ రాళ్లు, కోడిగుడ్లు విసరడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. వైసీపీ ఇప్పటికైనా తన విధానాలను మార్చుకోకపోతే రాజకీయంగా మనుగడ కష్టమవుతుందని హెచ్చరించారు. పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలను గృహ నిర్బంధాలు చేసేవారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ కల్పిస్తుంటే వైసీపీ నాయకులు దానిని హింసకు వేదికగా మార్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేసి సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించడంతో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను చూపేందుకు వచ్చినా వైసీపీ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. దౌర్జన్యాలతో అధికారంలోకి రావచ్చనే భ్రమల్లో వైసీపీ నాయకులు ఉన్నారని విమర్శించారు. గురువులను గౌరవించినప్పుడే చక్కటి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని గద్దె అనురాధ పేర్కొన్నారు. సమావేశంలో చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, చలసాని రమణ, గద్దె ప్రసాద్, దయాల శిరీష, సుగసాని రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు.

