మధ్యాహ్న భోజన బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలి
ఏప్రిల్ నుంచి చెల్లింపులు నిలిపివేయడం దారుణం అప్పులు చేసి పథకాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకులు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

ఆచంట, సెప్టెంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న సిబ్బందికి నెలల తరబడి బిల్లులు, వేతనాలు చెల్లించకపోవడం దారుణమని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచంట వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అనంతరం పుష్పరాజ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరుతో ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం అభినందనీయమే అయినప్పటికీ, దానిని నిర్వహిస్తున్న సిబ్బందికి సకాలంలో బిల్లులు, వేతనాలు అందించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం బియ్యం, గుడ్లు మాత్రమే అందిస్తోందని, మిగిలిన సరుకులకు సంబంధించిన బిల్లులతోపాటు నిర్వాహకుల వేతనాలను గత ఏప్రిల్ నుంచి చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో పలుచోట్ల నిర్వాహకులు బంగారం తాకట్టు పెట్టడంతోపాటు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. బిల్లులు, వేతనాలు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమేనని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తెలిపారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ మొత్తాలను విడుదల చేయడంతోపాటు ఇకపై సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోలాటి ప్రసాదరావు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

