నిండుకుండలా బుడమేరు
కొండపల్లి–కవులూరు వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవాహం ఎగువ వరదతో ముప్పు లేదన్న నీటిపారుదల అధికారులు గంటగంటకూ నీటిమట్టం, ప్రవాహంపై పర్యవేక్షణ

కొండపల్లి, సెప్టెంబర్ 24 : భారీ వర్షాల ప్రభావంతో కొండపల్లి–కవులూరు వంతెన వద్ద బుడమేరు నిండుకుండలా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతున్నప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ సహాయ ఇంజినీర్ వెంకటేష్ తెలిపారు. పట్టిసీమ నుంచి వస్తున్న సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిలో కొంత భాగాన్ని చెరువులకు మళ్లిస్తూ బుడమేరుపై ఒత్తిడి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో కొండపల్లి–కవులూరు వంతెన సమీపంలో గండ్లు పడిన ప్రాంతంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రస్తుత వరద ప్రవాహానికి రక్షణగా నిలిచిందని అధికారులు తెలిపారు. బుడమేరు ప్రవాహ ఉద్ధృతి, నీటిమట్టాన్ని గంటగంటకూ పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

