సత్తెనపల్లి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
నాలుగు మండలాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కన్నా తాగునీరు రహదారులు వైద్యం విద్యుత్‌పై ప్రత్యేక వినతిపత్రం ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని వెల్లడి

నరసరావుపేట, సెప్టెంబర్ 25: సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జిల్లా అధికారులను కోరారు. నరసరావుపేట కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఇతర శాసనసభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి రూరల్, రాజుపాలెం, ముప్పాళ్ల, నకరికల్లు మండలాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం, తాగునీరు, రహదారులు, విద్యుత్, వైద్యం, విద్య తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను వివరిస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను తొలగించడం, దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టడం, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరతను పరిష్కరించడంతోపాటు విద్యుత్ సమస్యలను వెంటనే సరిదిద్దాలని అధికారులను కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ లక్ష్యమని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

