మెట్రోకు అడ్డంకులు.. విజయవాడ పరిధిలో సర్వే
▪️ మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణలో కీలకమైన సామాజిక ప్రభావ అంచనా సర్వే... ▪️ గుణదల, మాచవరం, పటమట, రామవరప్పాడు, ప్రసాదంపాడు సహా పలు ప్రాంతాల్లో పరిశీలన... ▪️ ఇళ్లు, షాపులు, పునరావాసం, ప్రజల అభ్యంతరాలపై నివేదిక.. ప్రక్రియకు ఆరు నెలలు పట్టే అవకాశం...

విజయవాడ: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో కీలకమైన సామాజిక ప్రభావ అంచనా సర్వే మూడు మండలాల పరిధిలో కొనసాగుతోంది. మెట్రో నిర్మాణంతో ప్రభావితమయ్యే ప్రాంతాలు, ఆస్తులు, ప్రజల జీవనోపాధిపై పడే ప్రభావాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు.
విజయవాడ పరిధిలోని గుణదల, మాచవరం, పటమట, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, దోనె అటుకూరు, గుడవల్లి తదితర ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. మెట్రో ప్రాజెక్టు కోసం అవసరమయ్యే భూములు, ప్రభావితమయ్యే ఇళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలతో పాటు పునరావాసం, ప్రజల అభ్యంతరాలు వంటి అంశాలను నమోదు చేస్తున్నారు.
సర్వే పూర్తయిన అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి తదుపరి భూసేకరణ ప్రక్రియకు అధికారులు ముందుకెళ్లనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

