సాగునీటి కోసం తగ్గేదేలే.. మూడో రోజుకు రిలే దీక్ష
▪️ గూడూరు, పెడన తర్వాత బంటుమిల్లిలో కొనసాగిన నిరాహార దీక్ష ▪️ సాగునీరు ఇచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదన్న ఉప్పాల రాము ▪️ రైతులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి భారీ మద్దతు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV మచిలీపట్నం | బంటుమిల్లి | ఆగస్టు 08: రైతులకు సాగునీరు విడుదల చేయాలనే డిమాండ్‌తో పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ ఉప్పాల రాము చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారంతో మూడో రోజుకు చేరుకుంది. రెండు రోజులుగా గూడూరు, పెడనలో దీక్షలు నిర్వహించిన ఆయన మూడో రోజు బంటుమిల్లిలో దీక్షను కొనసాగించారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షలో పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు సాగునీరు అందించే వరకు పోరాటాన్ని విరమించేది లేదని ఉప్పాల రాము స్పష్టం చేశారు. ప్రస్తుతం నీటిని విడుదల చేసి తర్వాత నిలిపివేస్తే మళ్లీ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అవసరమైతే రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని ప్రకటించారు. బంటుమిల్లిలో జరిగిన దీక్షకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలపగా, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

