స్థానిక పోరులో కూటమిని గెలిపించాలి
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్

నందిగామ, సెప్టెంబరు 6 (ఆంధ్రప్రభ): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్ పిలుపునిచ్చారు. నందిగామకు వచ్చిన ఆయన స్థానిక బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నేత కత్రోజు శ్రీనివాసాచారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులతోపాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల రాకతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాష్ట్రానికి నాయకత్వం వహిస్తేనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు పాశం చంద్రశేఖర్ నాని, పిల్లా దినేష్, కృష్ణ, అచ్చి చినబాబు తదితరులు పాల్గొన్నారు.

