గంజాయి వినియోగంపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
అజిత్‌సింగ్‌నగర్‌లో ఈగల్ బృందం, పోలీసుల సంయుక్త తనిఖీలు... రెండు అపార్ట్‌మెంట్లలో 21 మందికి గంజాయి పరీక్షలు... అందరికీ నెగెటివ్ ఫలితాలు.. మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక...

విజయవాడ, అక్టోబర్ 11: నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈగల్ బృందం, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎక్సెల్ ప్లాంట్ అపార్ట్‌మెంట్స్, రామనగర్ అపార్ట్‌మెంట్స్‌లో సామూహిక గంజాయి పరీక్షలు చేపట్టారు. మొత్తం 21 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా అజిత్‌సింగ్‌నగర్ సీఐ చంద్రశేఖర్ దాడి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగం, విక్రయం, రవాణా, నిల్వ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు అనే నినాదంతో యువతలో అవగాహన పెంపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

