భక్తజన సందోహంతో ఇంద్రకీలాద్రి!
ఏఐ నిఘాలో భక్తుల రద్దీ నియంత్రణ.. నిరంతరం పోలీసుల పర్యవేక్షణ... తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలపై అధికారుల ప్రత్యేక దృష్టి... సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యంగా వివిధ శాఖల సమన్వయం...

విజయవాడ, అక్టోబర్ 15: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంగా మారింది. శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం, దేవాదాయశాఖ, పోలీసు శాఖ, నగరపాలక సంస్థ సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. ఏఐ నిఘాలో భక్తుల రద్దీ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు పర్యవేక్షణలో ఆలయ పరిసరాల్లో భద్రతను పటిష్ఠం చేశారు. కృత్రిమ మేధస్సు ఆధారిత రద్దీ విశ్లేషణ, సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా భక్తుల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) నేతృత్వంలో దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నారు. తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం ధ్యానచంద్ర పర్యవేక్షణలో క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాగునీటి సరఫరా, చెత్త తొలగింపు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్వహణపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. అందుబాటులో వైద్య సేవలు భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించేందుకు ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. వృద్ధులు, చిన్నారులు, ప్రత్యేక సహాయం అవసరమైన భక్తులకు సిబ్బంది సేవలందిస్తున్నారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ అధికారులకు సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.

