పేదల సొంతింటి కలకు చేయూత
ఇళ్ల నిర్మాణానికి రూ.2.50 లక్షల వరకు సాయం… పేదలకు శాశ్వత భూహక్కులు కల్పిస్తున్నామన్న బొండా ఉమా… 26 నెలల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా దాదాపు రూ.9 కోట్ల సాయం…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 8: పేదలకు శాశ్వత భూహక్కులు కల్పించడంతోపాటు సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం సింగ్‌నగర్‌లోని తన కార్యాలయంలో 60, 61, 62 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పథకం మంజూరు పత్రాలు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండో విడతలో లబ్ధిదారుల ఆధ్వర్యంలో చేపట్టే వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో అర్హులైన వేలాది పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా చేయూతనిస్తున్నామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు పట్టాలు, శాశ్వత రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు

చెప్పారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. పేదలు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత 26 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దాదాపు రూ.9 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఉమా తెలిపారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులైన బాధిత కుటుంబాలకు సాయం అందేలా కృషి చేస్తున్నామన్నారు. పదవిని బాధ్యతగా భావిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఘంటా కృష్ణమోహన్, దాసరి ఉదయశ్రీ, పైడి తులసి, పైడి శ్రీను, జలకం రాజా, కంచి ధనశేఖర్, దాసరి దుర్గారావు, బేవర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
