దుర్గమ్మను దర్శించుకున్న హరికథా కళాకారుడు
సింహాచల శాస్త్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాల అందజేత సంస్కృతి, సంప్రదాయాలను యువతకు చేరువ చేస్తున్నారన్న ఈవో

విజయవాడ, సెప్టెంబర్ 24: సుప్రసిద్ధ హరికథా కళాకారుడు డాక్టర్ ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె.శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీస్సులు అందించారు. ఈవో శీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సింహాచల శాస్త్రిని సత్కరించారు. సింహాచల శాస్త్రి తన గాత్రం, పాండిత్యం, అభినయంతో హరికథా కళకు విశేష గుర్తింపు తీసుకొచ్చారని ఈవో కొనియాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా సనాతన ధర్మం, భక్తి విశిష్టత, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను యువతకు అర్థమయ్యేలా చేరవేస్తున్నారని అభినందించారు. అమ్మవారి దర్శనం కల్పించి సత్కరించిన ఆలయ అధికారులకు సింహాచల శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు.

