అక్రిడిటేషన్ అడ్డుగా.. టాయ్ పిస్టల్‌తో బెదిరింపులా?
మైలవరంలో విలేకరిగా చెప్పుకునే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు ఫుడ్ సేఫ్టీ తనిఖీల తర్వాత హోటల్ యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు కారులో నిజమైన తుపాకీని పోలిన టాయ్ పిస్టల్ గుర్తింపు.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

మైలవరం, ఆగస్టు 27: జర్నలిజం పేరును అడ్డుపెట్టుకుని వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపుతున్నాయి. కుంభ గోవింద్ అలియాస్ వజ్రం అనే వ్యక్తిపై బాధితులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలోని పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో గోవింద్ అధికారుల పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
తనిఖీల తర్వాతే అసలు కథ?
ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లిపోయిన అనంతరం కొన్ని హోటళ్లు, షాపుల యజమానులను సంప్రదించి, కేసులు కాకుండా చూడాలంటే డబ్బులు ఇవ్వాలంటూ అక్రిడిటేషన్ కార్డు చూపించి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఓ బాధిత హోటల్ యజమాని పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడికి సంబంధించిన కారును నున్న ప్రాంతంలో గుర్తించినట్లు తెలిసింది. కారును తనిఖీ చేయగా నిజమైన పిస్టల్‌ను పోలిన టాయ్ పిస్టల్ లభించినట్లు సమాచారం. ఈ అంశం వ్యవహారాన్ని మరింత తీవ్రంగా మార్చింది.
ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన పేరును ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడటంతో పాటు ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం.
ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఫిర్యాదులు
కేసు విషయం వెలుగులోకి రావడంతో మరికొందరు బాధితులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డిగూడెంకు చెందిన వ్యక్తికి కారు విక్రయిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసం చేశాడని, అనంతవరం రైతు వద్ద తొమ్మిది మేకలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. కోత మిషన్ యజమాని, మట్టి ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ఈ ఆరోపణలన్నింటిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆరోపణల నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని మైలవరం ఎస్ఐ సుధాకర్ తెలిపినట్లు సమాచారం. పట్టుబడిన అనంతరం విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నట్లు తెలిసింది.

