నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలి... రౌడీ, సస్పెక్ట్ షీటర్లపై నిరంతర నిఘా.. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించాలి... మహిళల భద్రత, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి...

V10TV మచిలీపట్నం (ప్రతినిధి): కృష్ణా జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీస్ అధికారులను ఆదేశించారు. 2026 జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల కేసులు, రౌడీ, సస్పెక్ట్ షీటర్లపై చర్యలు తదితర అంశాలపై జిల్లా పోలీస్ అధికారులతో హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల స్వభావాన్ని విశ్లేషించి, వాటికి కారణమయ్యే అంశాలను గుర్తించాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా నేరాలు జరగకుండా, పునరావృతం కాకుండా ప్రివెంటివ్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
పెండింగ్ దర్యాప్తు కేసులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో వేగంతో పాటు నాణ్యత ఉండాలని, ప్రాధాన్యత క్రమంలో కేసులను పరిష్కరించి చార్జిషీట్లు, ఫైనల్ రిపోర్టులను సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. జిల్లాలో దీర్ఘకాలంగా దర్యాప్తులో ఉన్న కేసులు 30 శాతం తగ్గినప్పటికీ మిగిలిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
తీవ్ర నేరాల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. నేర స్థల పరిశీలన, ఆధారాల సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నిందితుల గుర్తింపు తదితర అంశాల్లో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలన్నారు. జిల్లాలో గ్రేవ్ కేసుల డిటెక్షన్ శాతం 2025లో 92.54 శాతం ఉండగా, 2026 జనవరి నుంచి జూలై వరకు 94.74 శాతానికి పెరిగిందని తెలిపారు.
రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. రౌడీ షీటర్ల బైండ్ఓవర్ 80.6 శాతం ఉండగా, సస్పెక్ట్ షీటర్ల బైండ్ఓవర్ 66.2 శాతంగా ఉందని, సస్పెక్ట్ షీటర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు వారి భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. మిస్సింగ్ కేసులను సీరియస్‌గా తీసుకుని బాధితులను త్వరగా గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. 2026 జనవరి నుంచి జూలై వరకు మిస్సింగ్ కేసుల్లో ట్రేసింగ్ శాతం 90.37గా నమోదైందని, ముఖ్యంగా 48 గంటల్లో గుర్తించడంపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ స్పష్టం చేశారు. 2026 జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 24 ఎన్డీపీఎస్ కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేయడంతో సరిపెట్టకుండా డ్రగ్స్ సరఫరా మూలాలను గుర్తించి మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణ, కేసుల సత్వర దర్యాప్తు, నిందితులకు శిక్ష పడేలా ఆధారాల సేకరణ, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి అధికారి, సిబ్బంది పనిచేయాలని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

