ఉత్సవాల సందడితో ట్రాఫిక్‌కు బ్రేకులు!
విజయవాడ ఉత్సవ్, సరస్ మేళాతో పెరిగిన వాహనాల రద్దీ… చిట్టినగర్ జంక్షన్–ఎర్రకట్ట రోడ్డులో నెమ్మదించిన రాకపోకలు… ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచన…

విజయవాడ, అక్టోబర్ 13: విజయవాడ ఉత్సవ్, సరస్ మేళా నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. ఉత్సవాలకు వీఐపీలు, సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో చిట్టినగర్ జంక్షన్ నుంచి ఎర్రకట్ట రోడ్డు వరకు కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకులతోపాటు సాధారణ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు రద్దీ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవడంతోపాటు ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజల సౌకర్యం, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా నిరంతరం విధులు నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

