అయోధ్యనగర్ చోరీ కేసు ఛేదన!
సీసీఎస్ సహకారంతో నిందితుడిని అరెస్టు చేసిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు… ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఉంగరాలు చోరీ చేసినట్లు ఫిర్యాదు… బెట్టింగ్‌లకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి…

విజయవాడ, నవంబర్ 11: విజయవాడ అయోధ్యనగర్‌లో జరిగిన ఇంటి దొంగతనం కేసును అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు సీసీఎస్ బృందం సహకారంతో ఛేదించారు. ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లిన వ్యక్తి నివాసంలో చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఆర్‌ఆర్‌పేట రైల్వే ట్రాక్ సమీపంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాళాలు పగులగొట్టి చోరీ అయోధ్యనగర్ చేవూరు వారి వీధిలో నివాసం ఉంటున్న వెంకటరావు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 8వ తేదీ సాయంత్రం విధులకు వెళ్లిన ఆయన 9వ తేదీ ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో కుమార్తె అమరపు శిరీషకు సమాచారం అందించారు. ఆమె వచ్చి పరిశీలించగా బీరువాలోని రూ.11 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ సహకారంతో దర్యాప్తు ఫిర్యాదు ఆధారంగా అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు పశ్చిమ మండల డీసీపీ జి. రామకృష్ణ పర్యవేక్షణలో నార్త్ డివిజన్ ఏసీపీ పి. సత్యానందం, అజిత్‌సింగ్‌నగర్ సీఐ డి. చంద్రశేఖర్ నేతృత్వంలో సీసీఎస్, స్థానిక పోలీసు బృందాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో న్యూ ఆర్‌ఆర్‌పేట వద్ద అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన రెడ్డిమల్లి ఆశిష్ (27)ను ఈ కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. నవంబర్ 8వ తేదీ రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి రూ.11 వేల నగదు అపహరించినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎస్సై బి. కుర్మినాయుడు మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

