దసరా ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం
ఈ నెల 11 నుంచి 20 వరకు ఉండవల్లి సెంటర్‌లో నవరాత్రి వేడుకలు… మంత్రి లోకేష్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన ఉత్సవ కమిటీ సభ్యులు… ఉత్సవాలకు హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చినట్లు నిర్వాహకుల వెల్లడి…

తాడేపల్లి, అక్టోబర్ 10: గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శనివారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్ తప్పకుండా హాజరవుతానని తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు. నవరాత్రి వేడుకలు వైభవంగా, ప్రశాంత వాతావరణంలో జరగాలని మంత్రి ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
