విధ్వంసం గొడ్డలి పార్టీ బ్రాండ్... అభివృద్ధి కూటమి బ్రాండ్: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
మెగా డీఎస్సీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కొడాలి నాని విమర్శలకు ఘాటు కౌంటర్ ఐదేళ్లు డీఎస్సీ ఇవ్వని వారే ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్య ప్రాజెక్టులను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 5 (వి10టివి): మెగా డీఎస్సీ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశాలపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన ఆరోపణలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. విధ్వంసం గొడ్డలి పార్టీ బ్రాండ్ అయితే, అభివృద్ధి కూటమి ప్రభుత్వ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిన వారే ఇప్పుడు మెగా డీఎస్సీపై మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.
మెగా డీఎస్సీని పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు 240కిపైగా కోర్టు కేసులు వేశారని, అయినా ప్రభుత్వం న్యాయపరంగా విజయం సాధించిందన్నారు. హైకోర్టు కూడా ఒక్క అభ్యర్థి అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించలేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటాలో మొత్తం 421 పోస్టుల్లో 372 పోస్టులను మాత్రమే భర్తీ చేశామని, దురుద్దేశం ఉంటే మిగిలిన పోస్టులను కూడా తమకు అనుకూలంగా వినియోగించుకునే అవకాశం ఉండేదని అన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల కోసం స్పష్టమైన జీవో అమల్లో ఉందని చెప్పారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై మాట్లాడుతూ, పునాదుల దశలో ఉన్న ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్లి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసే స్థాయికి తీసుకువచ్చిందన్నారు. ఒక ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేయడం నుంచి అమలు వరకు పెద్ద ప్రక్రియ ఉంటుందని, ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇప్పుడు క్రెడిట్ కోసం మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అనేక ప్రాజెక్టులను గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కొనసాగించారని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని అన్నారు. పోలవరం సహా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తోందని తెలిపారు.
"చదువుకోని వారికి డీఎస్సీ విలువ ఏమి తెలుస్తుంది. 'బ్రిడ్జ్ గేమ్' అంటే మూడు ముక్కలాట, పేకాట కాదు... అది మేధస్సుతో ఆడే ఆట. మైండ్ లేని వారికి అది అర్థం కాదు. కూల్చడం మాత్రమే తెలిసిన వారికి అభివృద్ధి విలువ తెలియదు" అని వెనిగండ్ల రాము ఘాటుగా వ్యాఖ్యానించారు.
అంతేకాక, లోకేష్ విసిరిన సవాల్‌ను జగన్ స్వీకరించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రాము, వాస్తవాలపై చర్చకు సిద్ధమైతే ప్రజల ముందే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.

