ఉగ్రరూపం దాల్చిన బుడమేరు
నందివాడ మండలంలో ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం నీటమునిగిన పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు గుడివాడ–హనుమాన్ జంక్షన్ రాకపోకలకు ముప్పు

నందివాడ, సెప్టెంబర్ 25 : ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరడంతో పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు నీటమునిగాయి. చేతికొచ్చే పంటలు నీటిపాలు కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పుట్టగుంట వద్ద బుడమేరు వంతెనపై సుమారు అడుగు ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరదలో కొట్టుకొచ్చిన గుర్రపుడెక్క వంతెన వద్ద భారీగా పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ప్రొక్లైనర్లతో గుర్రపుడెక్కను తొలగించే పనులు చేపట్టారు. వరద ఉధృతి మరింత పెరిగితే గుడివాడ–హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

