జనసేన గూటికి వైసీపీ మాజీ రాష్ట్ర నేత షేక్ నాగుల్ మీరా
వంగవీటి రాధాకృష్ణ సమక్షంలో జనసేనలో చేరిక... నాగుల్ మీరాతో పాటు పార్టీలో చేరిన మౌలానా షేక్ సాజిద్ అలీ... పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాధాకృష్ణ పిలుపు...

పాయకాపురం, అక్టోబర్ 29 : విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ రాష్ట్ర నాయకుడు షేక్ నాగుల్ మీరా జనసేన పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ మాజీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేసిన ఆయనతో పాటు మసీదు ఇమామ్ మౌలానా షేక్ సాజిద్ అలీ కూడా జనసేనలో చేరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నగర మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ సమక్షంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే షేక్ నాగుల్ మీరా జనసేనలో చేరడం సంతోషకరమన్నారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు మంచి పేరు తీసుకువచ్చేలా అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగ్‌నగర్ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు కేదరాసపల్లి నరేంద్ర, 86వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు షేక్ రహీం, ప్రధాన కార్యదర్శి షేక్ మౌలా, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు.

