వరదొస్తే రహదారే బంద్
గుండవల్లి–జక్కుల నెక్కలం రహదారిపై ప్రమాదకరంగా బుడమేరు ప్రవాహం వరద నీటితో నిలిచిపోయిన ప్రజల రాకపోకలు వంతెన నిర్మిస్తామన్న పాలకుల హామీలు మాటలకే పరిమితమని ఆవేదన

గన్నవరం, సెప్టెంబర్ 25 (ఆంధ్రప్రభ): ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలంలోని గుండవల్లి నుంచి జక్కుల నెక్కలం వెళ్లే రహదారిపై బుడమేరు వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా ఈ రహదారిపై వంతెన నిర్మిస్తామన్న పాలకుల హామీలు ఆచరణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే రైతులు, విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బుడమేరుపై శాశ్వత వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

