కనకదుర్గమ్మకు తొలి పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ దంపతులు
ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, సారె అందజేత... వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి మేళతాళాలతో ఊరేగింపు... కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీపీ రాజశేఖరబాబు...

విజయవాడ, అక్టోబర్ 10: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం పోలీసుల ఆడపడుచుగా భావించే కనకదుర్గమ్మకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దంపతులు శనివారం తొలి పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించారు. ముందుగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోని రావిచెట్టు వద్ద కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్, వైదిక కమిటీ సభ్యులు సీపీ దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే దసరా ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పశ్చిమ డీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ ఎన్.వి.దుర్గారావు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గుణరాం, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

