విజయవాడ ఉత్సవ్–2.0లో సాంస్కృతిక సందడి!
లేజర్ షోలు, సంగీత ప్రదర్శనలతో హోరెత్తిన మాకినేని స్టేడియం… హరికథ, తోలుబొమ్మలాటలతో అలరించిన సంప్రదాయ కళాకారులు… వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా, యువనేత బొండా సిద్ధార్థ…

విజయవాడ, అక్టోబర్ 12: బెజవాడ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవానికి అద్దం పట్టేలా విజయవాడ ఉత్సవ్–2.0 రెండో రోజు వేడుకలు సోమవారం అట్టహాసంగా జరిగాయి. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం సంగీత, నృత్య ప్రదర్శనలతో సందడిగా మారింది. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువనేత బొండా సిద్ధార్థ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, గర్బా ఫ్యూజన్ నృత్యాలు, రంగురంగుల లేజర్ షోలు, బాణసంచా ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు తెలుగు సంప్రదాయ కళారూపాలైన హరికథ, తోలుబొమ్మలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక వినోదానికి సంప్రదాయ కళలను జోడించడంతో ఉత్సవ ప్రాంగణం కళకళలాడింది. నగర ప్రజలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు. స్థానిక కళాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్న విజయవాడ ఉత్సవ్ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. విభిన్న కళారూపాలను ఒకే వేదికపై ప్రదర్శించడం ద్వారా నగరవాసులకు వినోదంతో పాటు సంప్రదాయ కళల విశిష్టతను పరిచయం చేశారు.

