రూ.17 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
3వ డివిజన్ కామినేని నగర్‌లో పార్కు అభివృద్ధికి శంకుస్థాపన… నూతన విధానాలతో రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కృషి: ఎమ్మెల్యే గద్దె… హ్యామ్ విధానంతో రహదారుల నిర్మాణం.. పదేళ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే…

విజయవాడ, అక్టోబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ పాలనా అనుభవంతో నూతన విధానాలను అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కామినేని నగర్‌లో పార్కు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో రూ.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో అనేక వినూత్న విధానాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో రహదారుల నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విధానంలో నిర్మించిన రహదారులకు పదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లపైనే ఉంటుందని వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సమీకరించడం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమని అన్నారు. హ్యామ్ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన విధానాల ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో గద్దె రమేష్, పేరేపి ఈశ్వర్, ముమ్మనేని ప్రసాద్, దాడి సుబ్బారావు, తాడి బాబూరావు, బండి సాయి కోమలి, యలమంచిలి పండు, రవీంద్ర, గుంజా ఏసు తదితరులు పాల్గొన్నారు.

