రెండు దశల్లో మున్సిపల్ ఎన్నికలు
కోర్టు కేసులపై తీర్పుల తర్వాతే నోటిఫికేషన్‌పై స్పష్టత... ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం... తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆపై సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు...

అమరావతి, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. పుర ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించి, అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించే దిశగా కార్యాచరణపై చర్చ సాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై హైకోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో ప్రస్తుతం స్పష్టంగా చెప్పలేమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో తీర్పులు వెలువడాల్సి ఉన్నందున న్యాయపరమైన పరిణామాలను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు సహా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అంశాలపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.
నోటిఫికేషన్‌పై కోర్టు తీర్పులే కీలకం
ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నప్పటికీ నోటిఫికేషన్ తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పెండింగ్ న్యాయ వివాదాల్లో వచ్చే తీర్పులను బట్టి ఎన్నికల సంఘం తదుపరి అడుగులు వేసే అవకాశం ఉంది.

