రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం
జూరాల నుంచి సాగునీటి విడుదలపై కేటీఆర్ స్పందన ప్రభుత్వాన్ని కదిలించిన రైతులకు ధన్యవాదాలు రైతులకు అండగా పోరాటం కొనసాగిస్తామని వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రైతుల పోరాటాన్ని కొనియాడారు. పొలాలు ఎండిపోతున్న సమయంలో రైతులు సాగునీటి కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కదిలించి నీటిని విడుదల చేయించిన రైతులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటంలో రైతులతో కలిసి నడిచిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ప్రజల కనీస అవసరాలు తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’’ అని సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు.

