పెట్టుబడులతో పాటు ప్రకృతికీ ప్రాధాన్యం!
పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు… ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు నమ్మకమైన ప్రాంతమని వెల్లడి… అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసే సాగాలని సూచన…

విశాఖపట్నం, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రం పెట్టుబడులకు నమ్మకమైన ప్రాంతమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులను కేవలం యంత్రాలు, పరిశ్రమలకే పరిమితం చేయకుండా ప్రజల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారతదేశ భవిష్యత్తుపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రకృతిని నాశనం చేస్తూ సంపదను సృష్టించడం సరైన అభివృద్ధి కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా ఆర్థిక ప్రగతి సాధించే విధానాలను అనుసరించాలన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా ముందుకు సాగినప్పుడే సుస్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ప్రగతితో పాటు ప్రజల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

