శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నికీలలు!
ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్‌తో మంటలు... వంటనూనె డబ్బాలకు అంటుకున్న మంటలు.. భక్తుల్లో ఆందోళన... రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. అదుపులోకి వచ్చిన మంటలు...

శ్రీకాళహస్తి, నవంబర్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంటగదిలో ఉన్న నూనె డబ్బాలకు మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆలయ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించి భక్తులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఆలయంలో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై చర్చ మొదలైంది. ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

