అసెంబ్లీ కొత్త భవనానికి ‘గ్రీన్ సిగ్నల్’ దిశగా అడుగులు
అంతర్జాతీయ ప్రమాణాలతో శాసనసభ భవన నిర్మాణానికి ప్రణాళికలు... ఇంటీరియర్ డిజైన్, అత్యాధునిక డిజిటల్ సాంకేతికతపై ఉన్నతస్థాయి సమీక్ష... 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీలు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లపై చర్చ...

అమరావతి, ఆగస్టు 27: రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాశ్వత అసెంబ్లీ భవనాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సచివాలయంలో జరిగిన సమావేశంలో అసెంబ్లీ భవన నిర్మాణ ప్రణాళికలు, ఇంటీరియర్ డిజైన్, సభ్యులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆధునిక డిజిటల్ టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిలో 110 మంది ఎమ్మెల్సీలు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.
అమరావతి రాజధాని ప్రతిష్ఠకు తగ్గట్టుగా అసెంబ్లీ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్మాణం చేపట్టాలనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

