మత్తు మహమ్మారికి యువత బలి
మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన లఘుచిత్రం… ట్రైలర్‌ను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు… విద్యార్థులకు ప్రదర్శించేందుకు సహకరిస్తామని వెల్లడి…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 5: మాదకద్రవ్యాల వినియోగంతో యువత, కుటుంబాలు, సమాజంపై కలుగుతున్న దుష్ప్రభావాలను వివరించే ‘డ్రగ్స్–ఒక్కసారి చాలు’ సామాజిక అవగాహన లఘుచిత్రం ట్రైలర్‌ను నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదివారం ఆవిష్కరించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడంతోపాటు విద్యార్థుల్లో డ్రగ్స్‌పై అవగాహన పెంచే ఉద్దేశంతో లఘుచిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు షేక్ సోను తెలిపారు. సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనల ఆధారంగా

కథను రూపొందించామని చెప్పారు. డ్రగ్స్‌కు ఒక్కసారి అలవాటుపడితే వ్యక్తి జీవితం, కుటుంబ బంధాలు, ఆశయాలు, భవిష్యత్తు ఏవిధంగా నాశనమవుతాయో చిత్రంలో చూపించినట్లు వివరించారు. డ్రగ్స్‌ను అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజమంతా బాధ్యత తీసుకోవాలని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసేందుకు ఈ లఘుచిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించడానికి సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత, లఘుచిత్ర దర్శకుడు షేక్ సోను తదితరులు పాల్గొన్నారు.

