రూ.28 కోట్ల వంతెన ఉత్తర్వు బూటకమేనా
ఏడాది గడిచినా మొదలుకాని గూడవల్లి–జక్కులనెక్కలం వంతెన పనులు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఎలిజబెత్ రాణి

గన్నవరం, సెప్టెంబర్ 25: గూడవల్లి–జక్కులనెక్కలం మధ్య బుడమేరు వంతెన నిర్మాణానికి రూ.28 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు గతంలో అధికారులు తనకు ఇచ్చిన ఉత్తర్వు బూటకమేనా అని గన్నవరం మాజీ జెడ్పీటీసీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి ప్రశ్నించారు. గతేడాది సెప్టెంబర్‌లో బుడమేరు వరద కారణంగా గూడవల్లి–జక్కులనెక్కలం మధ్య రహదారి మునిగిపోయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. అప్పటి పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రూ.28 కోట్ల అంచనాలతో రెండు వరుసల వంతెన నిర్మిస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్ 8న నీటిపారుదల శాఖ అధికారులు తన పేరుతో లేఖ ఇచ్చారని వెల్లడించారు. వరద సమయంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులతో కలిసి పడవలో గ్రామానికి వెళ్లి వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. ఏడాది గడిచినా నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధే లక్ష్యమని ప్రచారం చేసుకోవడం కాకుండా ప్రజల అత్యవసర అవసరాలను తీర్చాలని కోరారు. అధికారులు గతంలో రూపొందించిన రూ.28 కోట్ల అంచనాల మేరకు గూడవల్లి–జక్కులనెక్కలం మధ్య బుడమేరు వంతెన నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ఎలిజబెత్ రాణి డిమాండ్ చేశారు.

