నాసిరకం భోజనానికి.. IRCTC భారీ జరిమానా!
స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మిక తనిఖీలు.. ఆహార నాణ్యతపై ఆరా... గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నాసిరకం దినుసులు గుర్తింపు.. కాంట్రాక్టర్‌కు రూ.10 లక్షల జరిమానా... లోపాలు పునరావృతమైతే కాంట్రాక్టే రద్దు చేస్తామని హెచ్చరిక.. ప్రయాణికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి...

న్యూఢిల్లీ, ఆగస్టు 27: రైలు ప్రయాణికులకు అందించే ఆహార నాణ్యత విషయంలో IRCTC కఠిన చర్యలకు దిగింది. ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గంలోని స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో IRCTC అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా రైలులో ఆహార తయారీ, నిల్వ, ప్రయాణికులకు సరఫరా చేస్తున్న పదార్థాల నాణ్యతను అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నాసిరకం దినుసులు గుర్తించినట్లు సమాచారం.
ఆహార నాణ్యత ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంబంధిత కాంట్రాక్టర్‌పై రూ.10 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడైంది. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతమైతే కాంట్రాక్టును రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.
రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం పరిశుభ్రంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా తనిఖీలు కొనసాగించాలని, ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని IRCTC చర్యలు చేపట్టింది.

