పోషకాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల
పెద్ద ఉల్లింగిపాలెం, చిన్న ఉల్లింగిపాలెం అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ఉత్సవం… కార్యకర్తలు, ఏఎన్‌ఎం, ఆశా సిబ్బంది సేవలకు ఘన సత్కారం… అంగన్‌వాడీ కేంద్రంతో పిల్లల ఎదుగుదల మెరుగైందన్న తల్లులు…

మచిలీపట్నం, అక్టోబర్ 1: పోషక మాసం–2026లో భాగంగా మచిలీపట్నం 23వ వార్డులోని పెద్ద ఉల్లింగిపాలెం–1, 2, చిన్న ఉల్లింగిపాలెం అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో అంగన్‌వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీడీపీఓ గ్లోరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్డు ఇన్‌చార్జి చింతా చిన్ని, ఆయన సతీమణి మేరీమణి, సూపర్‌వైజర్ జి.మాలతీదేవి, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కె.విజయకుమారి, ఎన్.సారాయి, సీహెచ్ సుమతి, ఆయాలు ఎస్.నాగమణి, నాగమణి, వి.రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, ఆయాలను చింతా చిన్ని సత్కరించారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన పెద్ద ఉల్లింగిపాలెం–2కు చెందిన షర్మిల మౌలాలి కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్‌ను బహూకరించారు. ప్రీ స్కూల్‌లో తమ పిల్లలకు అందుతున్న సేవలపై రేవతి అనే తల్లి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రంలో అందిస్తున్న పోషకాహారం కారణంగా పిల్లల ఎదుగుదల మెరుగుపడిందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

