కృష్ణా జిల్లాలో నేరాలకు చెక్.. పోలీసింగ్‌లో సత్ఫలితాలు
మహిళలు, బాలికలపై నేరాల్లో 42 శాతం తగ్గుదల... రోడ్డు ప్రమాద మరణాలు 30 శాతం తగ్గాయి... నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు.. అధికారులతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష...

వీ10టీవీ (ప్రతినిధి), మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మచిలీపట్నంలో ఆయన అధ్యక్షతన అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా డీఎస్పీలు, సీఐలు సమావేశానికి హాజరయ్యారు.
గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో నమోదయ్యే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎస్పీ వెల్లడించారు. పటిష్ఠ నిఘా, సమర్థవంతమైన దర్యాప్తు, ముందస్తు చర్యలతో నేరాలను నియంత్రించగలిగామని పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం నేరాలు 18 శాతం మేర తగ్గాయని తెలిపారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలు 42 శాతం, దొంగతనాల కేసులు 28 శాతం, ఎస్సీ, ఎస్టీ కేసులు 25 శాతం మేర తగ్గినట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సత్ఫలితాలు వచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో రోడ్డు ప్రమాద మరణాలను 30 శాతం మేర తగ్గించగలిగామని వెల్లడించారు.
నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను సమావేశంలో సమీక్షించిన ఎస్పీ, ఇదే పనితీరును కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

