గొల్లపాలెం రైతుల భూసేకరణ సమస్యపై ఎంపీ బాలశౌరి చొరవ
ఎన్‌హెచ్-65, ఎన్‌హెచ్-216 జంక్షన్ డిజైన్‌పై కేంద్రం దృష్టికి రైతుల సమస్యలు.. ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ డీజీ వినయ్ కుమార్ రాజావత్తో ఎంపీ భేటీ... క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్ఓ ఆర్.కె. సింగ్‌కు ఆదేశాలు...

v10tv మచిలీపట్నం, ఆగస్టు 13: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎస్.ఎన్. గొల్లపాలెం వద్ద ఎన్‌హెచ్-65, ఎన్‌హెచ్-216 జంక్షన్ అభివృద్ధి పనులతో రైతులు ఎదుర్కొంటున్న భూసేకరణ సమస్య పరిష్కారానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవ తీసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ డీజీ వినయ్ కుమార్ రాజావత్‌ను కలిసి రైతుల సమస్యలను వివరించారు.
ఎన్‌హెచ్-65, ఎన్‌హెచ్-216 నిర్మాణాల కోసం రైతులు ఇప్పటికే రెండుసార్లు భూములు కోల్పోయారని, ఇప్పుడు మూడోసారి భూసేకరణ జరిగితే మిగిలిన భూములు చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి వ్యవసాయానికి, జీవనోపాధికి ఇబ్బందికరంగా మారతాయని బాలశౌరి వివరించారు.
రైతులపై అదనపు భూసేకరణ భారం పడకుండా ప్రస్తుతం రహదారి మధ్యలో ఉన్న మీడియన్‌ను వినియోగిస్తూ ‘మీడియన్-ల్యాండింగ్ ఫ్లైఓవర్’ విధానంలో డిజైన్ మార్చాలని ప్రతిపాదించారు. దీనివల్ల కొత్తగా సేకరించాల్సిన భూమి గణనీయంగా తగ్గుతుందని, సాంకేతికంగానూ అమలు చేసే అవకాశం ఉందని వివరించారు.
ఒకవేళ భూసేకరణ తప్పనిసరైతే ఒకవైపు రైతుల భూములనే తీసుకోకుండా రహదారికి ఇరువైపులా సమానంగా భూమిని సేకరించాలని కోరారు. ఏకపక్షంగా భూములు సేకరిస్తే రైతుల రాకపోకలతో పాటు రహదారి ముఖద్వారంపై ఆధారపడిన వ్యాపారాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని డీజీ దృష్టికి తీసుకెళ్లారు.
రైతులు, ఇంజినీర్లు, ఎన్హెచ్ఏఐ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి మీడియన్-ల్యాండింగ్ ఫ్లైఓవర్ ప్రతిపాదనను సమీక్షించాలని బాలశౌరి కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతికంగా సాధ్యమైన ప్రత్యామ్నాయ డిజైన్‌కు అవసరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన డీజీ వినయ్ కుమార్ రాజావత్ సంబంధిత ఆర్ఓ ఆర్.కె. సింగ్‌ను సంప్రదించి, ఎస్.ఎన్. గొల్లపాలెం ప్రాంతాన్ని స్వయంగా సందర్శించాలని ఆదేశించినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని సూచించారు.
రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా సాంకేతికంగా సాధ్యమైన ప్రత్యామ్నాయాన్ని పరిశీలించి శాశ్వత పరిష్కారం సాధించడమే తన లక్ష్యమని బాలశౌరి తెలిపారు. ఏకపక్షంగా భూసేకరణ జరగకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.

