ధరల నియంత్రణపై నిరంతర నిఘా: గద్దె
నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు… జగన్ పాలనలో ధరలపై సమీక్షలే లేవని విమర్శ… రేషన్ బియ్యాన్ని విక్రయించవద్దని ప్రజలకు సూచన…

విజయవాడ, నవంబర్ 16: నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలపై ధరల భారం పడకుండా చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం 18వ డివిజన్ అశోక్‌నగర్‌లోని రఘు గార్డెన్ వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన పునరుతు రామారావుకు రిక్షా బండి, తామాడ కొండయ్యకు ఇస్త్రీ పెట్టెను ఎమ్మెల్యే తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. వీటి విలువ రూ.27 వేలని తెలిపారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ తుఫానుల ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయనే ఆందోళన ప్రజల్లో నెలకొందన్నారు. ఉల్లిపాయలు, బియ్యం తదితర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో నిత్యావసరాల ధరల నియంత్రణపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించవద్దని సూచించారు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. 18వ డివిజన్ కార్పొరేటర్ పఠాన్ హయత్ ఖాన్ మాట్లాడుతూ పేదల జీవనోపాధికి ఎమ్మెల్యే సొంత నిధులతో సహాయం అందించడం అభినందనీయమన్నారు. పీ–4 కార్యక్రమం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, మేదరమెట్ల నారాయణ, వీరమాచినేని రంగారావు, కోడే సాంబశివరావు, రాంబాబు, మోటూరి బుచ్చిబాబు, కర్ణ రమేష్, అబ్దుల్ నయిమ్, పోతిరెడ్డి వెంకట్రావు, నడికొప్పుల రవి తదితరులు పాల్గొన్నారు.
