అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!
అంబేద్కర్ కళావేదిక పరిసరాల్లో నో ఫ్లయింగ్ జోన్... పర్యటన ముగిసే వరకు ఎగిరే పరికరాలపై నిషేధం... నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ రాజశేఖరబాబు...

విజయవాడ, నవంబర్ 16: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కళావేదికతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు సోమవారం వెల్లడించారు. కేంద్ర మంత్రి పర్యటన ముగిసే వరకు ఈ ప్రాంతాల్లో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ విమానాలు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లతో పాటు ఇతర ఎగిరే పరికరాలను వినియోగించరాదని స్పష్టం చేశారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా నిషేధిత ప్రాంతాల్లో ఎవరైనా డ్రోన్లు లేదా ఇతర పరికరాలను ఎగురవేస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223తో పాటు విమానయాన చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పరికరాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కేంద్ర మంత్రి భద్రత దృష్ట్యా నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని, విధించిన ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

